డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత క్రియాశీలకంగా పాల్గొనాలని మూడో పట్టణ సీఐ శేషయ్య పిలుపునిచ్చారు. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీలో బుధవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే తీవ్రమైన దుష్పరిణామాలు, చట్టపరమైన చిక్కులు, దేశ భద్రతకు నార్కో టెర్రరిజం విసిరే సవాళ్లపై సీఐ శేషయ్య విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. యువత తమ జీవితాలను డ్రగ్స్‌కు దూరంగా ఉంచుకుని, దేశాభివృద్ధికి దోహదపడాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం (NDPS Act - 1985)లోని నిబంధనలను, ఈగల్ విభాగం చేపడుతున్న డ్రగ్స్ నిరోధక కార్యకలాపాలను ఆయన ప్రస్తావించారు. డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని రహస్యంగా అందించడానికి ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా, విద్యార్థులందరితో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. భవిష్యత్ తరాలను డ్రగ్స్ బారి నుండి రక్షించడంలో యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో క్లస్టర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ డాక్టర్ అక్తార్ భాను, ఈగల్ టీం హెడ్ కానిస్టేబుల్ ఎలిషా, కానిస్టేబుల్ మాసూమ్ వలి, స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ కోఆర్డినేటర్ శివ శంకర్, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.












