ఆన్లైన్లో మందులు, ఆరోగ్య ఉత్పత్తులు విక్రయిస్తున్నామంటూ నకిలీ వెబ్సైట్ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.2.66 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌కు చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఒక వ్యక్తి ఆన్లైన్లో ఆరోగ్య ఉత్పత్తులు, మందుల కోసం వెతుకుతుండగా ఒక నకిలీ వెబ్సైట్ కనిపించింది. అందులో ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు సుమారు రూ.83,257 చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్నప్పటికీ వస్తువులు మాత్రం అతడికి చేరలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా తూర్పు ఢిల్లీ సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దర్యాప్తులో భాగంగా పోలీసులు బ్యాంకు ఖాతాలు, ఖాతాదారుల గుర్తింపు పత్రాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఈ మోసానికి సంబంధించి రెండు బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.2,66,437 ఉన్నట్లు గుర్తించారు. ఆ మొత్తాన్ని ఏటీఎంల ద్వారా నగదుగా తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.












