ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నిత్యావసర సరుకుల లభ్యత, పప్పుధాన్యాల నిల్వలు, మార్కెట్ ధరలపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులు, వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరుకుల నిల్వలు అందుబాటులో ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.
భవిష్యత్తులో నిత్యావసర సరుకుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రజలకు నిత్యావసర సరుకులు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మార్కెట్లో సరుకుల డిమాండ్‌కు అనుగుణంగా వ్యాపారులు కనీసం 30 నుంచి 45 రోజుల పాటు సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. నిత్యావసర సరుకుల ధరలను కృత్రిమంగా పెంచడం, అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో నిత్యావసర సరుకుల లభ్యత, ధరలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, మార్కెట్లలో తనిఖీలు నిర్వహిస్తూ సరుకుల నిల్వల వివరాలు, నిల్వల రిజిస్టర్లు, కొనుగోలు, విక్రయ బిల్లులను పరిశీలించాలని సూచించారు. సరుకుల కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజలు నిత్యావసర సరుకుల విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అనవసరంగా అధిక మొత్తంలో సరుకులు కొనుగోలు చేయవద్దని కలెక్టర్ సూచించారు. మార్కెట్లో సరుకుల సరఫరా, ధరల నియంత్రణకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు, స్థానిక వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.












