భారతదేశంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు తరచుగా వార్తలలో నిలుస్తున్నాయి. అధికారులు ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించి, భారీ మొత్తంలో నగదు, విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్న సందర్భాలు మనం వింటూనే ఉంటాం. ఈ నేపథ్యంలో, సాధారణ పౌరులలో తమ ఇళ్లలో ఎంత నగదును ఉంచుకోవచ్చు, ఏవైనా పరిమితులున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, వ్యక్తులు తమ ఇళ్లలో నిర్దిష్ట మొత్తంలో నగదును ఉంచుకోవడానికి అనుమతి ఉంది. అయితే, ఈ నగదుకు సంబంధించిన మూలాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నించినప్పుడు, దానిని చట్టబద్ధంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత పన్ను చెల్లింపుదారుడిపై ఉంటుంది.
ఆదాయపు పన్ను రిటర్న్లలో చూపించిన ఆదాయం ఆధారంగానే నగదును కలిగి ఉండాలి. ఒకవేళ ఆదాయపు పన్ను అధికారులు ఏవైనా ఇళ్లు లేదా కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించినప్పుడు, అక్కడ దొరికిన నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపించలేకపోతే, ఆ నగదును ఆదాయంగా పరిగణించి, దానిపై పన్ను విధించే అవకాశం ఉంది. అలాగే, నగదుకు సంబంధించిన మూలాన్ని వివరించడంలో విఫలమైతే, జరిమానాలు కూడా విధించబడతాయి.
పన్ను చెల్లింపుదారులు తమ వద్ద ఉన్న నగదు మొత్తానికి సంబంధించిన లెక్కలను సరిగ్గా నిర్వహించుకోవాలి. ఆదాయపు పన్ను రిటర్న్లలో అన్ని ఆదాయ మార్గాలను స్పష్టంగా పేర్కొనాలి. దీని ద్వారా, భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖ నుండి వచ్చే ఏవైనా ప్రశ్నలకు సులభంగా సమాధానం ఇవ్వవచ్చు మరియు చట్టపరమైన చిక్కులను నివారించవచ్చు.











