రుణ బకాయిలను సంస్థలు తమ వార్షిక ఆర్థిక నివేదికల్లో (బ్యాలెన్స్ షీట్లలో) గుర్తించినప్పుడు, రుణదాతలకు కొత్త పరిమితి గడువు ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పు చెల్లించాల్సిన బాధ్యతను లిఖితపూర్వకంగా అంగీకరించినప్పుడు, పరిమితి చట్టం 1963లోని సెక్షన్ 18 ప్రకారం ఆ అంగీకారం చేసిన తేదీ నుంచి కొత్తగా గడువు లెక్కించాల్సి ఉంటుందని తెలిపింది.
ఢిల్లీకి చెందిన విగ్యాపన్ లోక్ ఢిల్లీ అడ్వర్టైజింగ్ కోఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన కేసులో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. నిర్మాణ పనులకు సంబంధించి వాజీర్ హుస్సేన్ అనే వ్యక్తికి రావాల్సిన రూ.11.16 లక్షల బకాయిల కోసం 2014లో దావా దాఖలైంది. అయితే, కాలపరిమితి ముగిసిందంటూ ఢిల్లీ హైకోర్టు ఆ దావాను కొట్టివేసింది. దీనిపై అప్పీల్ విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం, సంస్థ బ్యాలెన్స్ షీట్లలో 2004 నుంచి 2013 వరకు బకాయిలు కొనసాగినట్లు గుర్తించింది. బ్యాంకు లావాదేవీల్లో వాజీర్ హుస్సేన్ కాంట్రాక్టర్ పేరుతో మూడు చెక్కులు జారీ అయిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. అప్పు అంగీకారానికి ప్రత్యేకమైన నమూనా అవసరం లేదని, సంబంధిత లావాదేవీల ఆధారంగా బకాయి బాధ్యత కొనసాగుతున్నట్లు స్పష్టమైతే సరిపోతుందని పేర్కొంది. ప్రతి తదుపరి అంగీకారం నుంచి కొత్త పరిమితి గడువు ప్రారంభమవుతుందని, ఆలస్యాన్ని క్షమించాలని ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. దీంతో గతంలో కొట్టివేసిన దావాను తిరిగి విచారణకు స్వీకరించాలని ఆదేశించింది. అయితే, అసలు బకాయి ఎంత చెల్లించాలనే అంశంపై తుది నిర్ణయం విచారణలోనే తీసుకోవాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రుణ బకాయిలను సంస్థలు తమ వార్షిక ఆర్థిక నివేదికల్లో (బ్యాలెన్స్ షీట్లలో) గుర్తించినప్పుడు, రుణదాతలకు కొత్త పరిమితి గడువు ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లిమిటేషన్ యాక్ట్ 1963లోని సెక్షన్ 18 ప్రకారం, అప్పు చెల్లించాల్సిన బాధ్యతను లిఖితపూర్వకంగా అంగీకరించిన తేదీ నుంచి కొత్తగా గడువు లెక్కించబడుతుంది.





