ప్రభుత్వ అధికారుల చట్టబద్ధ పరిధిలోకి వచ్చే సహకార బ్యాంకు లేదా సంఘానికి సంబంధించిన పత్రాలను సమాచార హక్కు చట్టం కింద పొందవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆ పత్రాలు ప్రభుత్వ అధికారి కార్యాలయంలో భౌతికంగా అందుబాటులో లేకపోయినా, చట్టం ద్వారా వాటిని తెప్పించుకునే అధికారం ఉంటే అవి సమాచార హక్కు చట్టంలోని సమాచారం నిర్వచన పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.
జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ది ముప్పతడం సర్వీస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కేసులో బ్యాంకు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. బ్యాంకు సభ్యుడు కోరిన నిర్మాణ ఒప్పందం, చివరి సర్వసభ్య సమావేశం మినిట్స్ ప్రతులను రెండు వారాల్లో అందించాలని సంబంధిత జాయింట్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అసలు వివాదం ఏమిటి
కేరళకు చెందిన ముప్పతడం సహకార బ్యాంకులో సభ్యుడైన ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద రెండు పత్రాలను కోరారు. బ్యాంకు భవన నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కార్మిక సహకార సంఘంతో కుదుర్చుకున్న నిర్మాణ ఒప్పందం ఒకటి, బ్యాంకు చివరి సర్వసభ్య సమావేశపు మినిట్స్ మరొకటి. అయితే, ఆ పత్రాలు అందించాలన్న అభ్యర్థనను తొలుత తిరస్కరించారు. ఈ వ్యవహారం సమాచార కమిషన్, కేరళ హైకోర్టు వరకు వెళ్లింది. చివరకు హైకోర్టు డివిజన్ బెంచ్ సభ్యుడికి ఆ పత్రాలు అందించాలన్న నిర్ణయాన్ని సమర్థించింది. దానిని సవాలు చేస్తూ సహకార బ్యాంకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.












