అమెరికా రక్షణ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, పెంటగాన్‌లో సైనిక వ్యూహాలు, ప్రణాళికల రూపకల్పనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ బ్రెట్ సిల్వియాను పదవి నుంచి తొలగించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కొత్త సైనిక దాడులు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సిల్వియా తొలగింపునకు గల కారణాలను అమెరికా రక్షణ శాఖ వెల్లడించలేదు. అలాగే, ఆయన స్థానంలో ఎవరిని నియమించనున్నారనే విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు. బ్రెట్ సిల్వియా అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌లో వ్యూహాలు, ప్రణాళికలు, విధానాల విభాగం డైరెక్టర్‌గా పనిచేశారు. సైనిక వ్యవహారాల్లో ఈ పదవిని జే5గా పిలుస్తారు. అంతర్జాతీయ భద్రతా పరిస్థితులను విశ్లేషించడం, సైనిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం, మిత్రదేశాలతో సమన్వయం చేయడం వంటి కీలక బాధ్యతల్లో ఈ విభాగం పాత్ర ఉంటుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సిల్వియా గతంలో అమెరికా సైన్యంలోని 101వ వైమానిక దళ విభాగానికి కమాండర్‌గా పనిచేశారు. ఆయనకు మొత్తం 32 ఏళ్ల సైనిక సేవానుభవం ఉంది. ఆయన సేవలను గుర్తుచేస్తూ జాయింట్ స్టాఫ్ ప్రతినిధి కృతజ్ఞతలు తెలిపారు. అయినప్పటికీ, ఉన్నత స్థాయి సైనిక ప్రణాళికల బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారిని అకస్మాత్తుగా తొలగించడానికి కారణమేమిటో అధికారికంగా వెల్లడించలేదు.












