అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు పారదర్శకమైన, స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే అధికారుల ప్రధాన లక్ష్యమని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్రీదేవి తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేయాలని ఆమె సూచించారు. ఓటర్ల నమోదు, జాబితా శుద్ధీకరణ ప్రక్రియలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పౌరులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మరణించిన వారి, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాను శుద్ధీకరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఓటు హక్కు పొందే యువతలో అవగాహన పెంచేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ 78 శాతం పూర్తయినట్లు అధికారులు వివరించారు. పారదర్శక, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీదేవి పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి, అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో ప్రభాకర్, డిప్యూటీ శిక్షణ కలెక్టర్ రవితేజ, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.












