భద్రాద్రి జిల్లా భద్రాచలం పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. కొల్లుగూడెం ఇసుక ర్యాంపు వద్ద అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ వాహనాలను తదుపరి చర్యల కోసం తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
కొల్లుగూడెం ఇసుక ర్యాంపు నుంచి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజల రాకపోకలు తక్కువగా ఉండే సమయంలో ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేసి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ఇప్పటికే పలుమార్లు ర్యాంపు మార్గాల్లో కందకాలు తవ్వించి రాకపోకలను నిలిపివేసినట్లు భద్రాచలం తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. తన బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లో మూడుసార్లు జేసీబీలతో ర్యాంపు దారులను మూసివేసినప్పటికీ, అక్రమంగా ఇసుక తరలించేవారు వాటిని మట్టితో పూడ్చి మళ్లీ రవాణా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా మూడు రోజుల క్రితం కూడా ర్యాంపు మార్గాలను మూసివేసినట్లు చెప్పారు.











