అమెరికా డాక్టర్‌గా నటిస్తూ, విదేశాల నుంచి భారీగా డాలర్లు పంపిస్తున్నామని ఆశచూపి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను రూ.21 లక్షలకు పైగా మోసం చేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
మదనపల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మదనపల్లె మండలం పప్పిరెడ్డిపల్లెకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వడ్లూరి మోహన్ కుమార్, 'ఎడ్విన్' అనే పేరుతో అమెరికా డాక్టర్‌గా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడి వలలో పడ్డారు.
విదేశాల నుంచి డాలర్లు పంపిస్తానని, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం డబ్బు చెల్లించాలని నమ్మించి, ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య రూ.21,37,200 ఆన్లైన్ ద్వారా వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ బి. పావని పర్యవేక్షణలో సీఐ కె. కళా వెంకటరమణ, ఎస్ఐ రామకృష్ణారెడ్డి, సైబర్ సెల్ సిబ్బంది కలిసి ఈ కేసును ఛేదించారు. మంగళవారం మదనపల్లె-తిరుపతి రహదారిలో అస్సాం, త్రిపుర రాష్ట్రాలకు చెందిన ప్రధాన నిందితులు సురజిత్ చేతియా, అహోట్లియన్ కైపెంగ్‌లను అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లు, 57 పాస్ బుక్కులు, 35 ఏటీఎం కార్డులు, 49 చెక్ బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. కష్టపడకుండా డబ్బు వస్తుందంటే మోసమేనని, అత్యాశకు పోవద్దని, అనుమానం వస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఎస్పీ సూచించారు.












