ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పెళ్లై నాలుగు నెలలు కూడా గడవకముందే ఓ నవవధువు హోటల్ గది ద్వారం వద్ద అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో కేసు వెలుగులోకి వచ్చింది. మృతురాలిని 28 ఏళ్ల ముస్కాన్‌గా గుర్తించారు. ఆమె మృతిపై తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తూ భర్తపై హత్య ఆరోపణలు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఝాన్సీలోని రిషభ్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం హోటల్ గది నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ముస్కాన్ తన భర్త నీలేశ్, హోటల్ సిబ్బందితో కలిసి గది వైపు వెళ్లింది. నిఘా కెమెరాలో నమోదైన దృశ్యాల ప్రకారం, గది ద్వారం వద్దకు చేరుకోగానే ఆమె ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. ఆమె కుప్పకూలిన వెంటనే భర్త ఆమెను పైకి లేపి గదిలోకి తీసుకెళ్లినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం హోటల్ సిబ్బంది సహాయంతో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనకు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, మృతురాలి తండ్రి రామ్జీలాల్ తన కుమార్తె మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. భర్త నీలేశ్ ఆమెను బంధువుల ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పి హోటల్‌కు తీసుకెళ్లాడని, తన కుమార్తె తలకు గాయమైందని, మరణం వెనుక కారణాలను పూర్తిగా విచారించాలని పోలీసులను కోరారు.










