కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. వినియోగదారుల తరఫున పనులు పూర్తి చేసే ఏఐ ఏజెంట్, సిస్కో అధ్యక్షుడు జీతూ పటేల్ వ్యక్తిగత ఈమెయిల్ ఖాతాను విశ్లేషించింది. దీని ద్వారా ఆయన ఏడాదికి సుమారు రూ.1.14 లక్షలు ఆదా చేయగలిగారు.
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సమాచారాన్ని విశ్లేషించడం వంటి పనులకే పరిమితమైన ఏఐ.. ఇప్పుడు వినియోగదారుల తరఫున పనులు కూడా పూర్తి చేస్తోంది. దీనికి ఉదాహరణగా సిస్కో అధ్యక్షుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జీతూ పటేల్ అనుభవం నిలిచింది. తన వ్యక్తిగత ఈమెయిల్ ఖాతాను పరిశీలించేందుకు ఏఐ ఏజెంట్‌కు అనుమతి ఇచ్చిన ఆయన, ఏడాదికి సుమారు 9,000 డాలర్లు (రూ.8.54 లక్షలు) వివిధ సబ్స్క్రిప్షన్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అనవసరమైన సేవలను గుర్తించి రద్దు చేయడంతో ఏడాదికి 1,000 నుంచి 1,200 డాలర్లు (సుమారు రూ.95 వేల నుంచి రూ.1.14 లక్షల వరకు) ఆదా చేయగలిగారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈమెయిళ్లు పరిశీలించి ఖర్చుల లెక్కలు
జీతూ పటేల్ తన వ్యక్తిగత ఈమెయిల్ ఖాతాను ఏఐ ఏజెంట్‌తో పరిశీలింపజేశారు. అందులోని చెల్లింపులు, పునరావృత సబ్స్క్రిప్షన్ల వివరాలను విశ్లేషించిన ఏజెంట్, ఏ సేవకు ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంతకాలంగా ఆ చెల్లింపులు కొనసాగుతున్నాయి అనే వివరాలతో పట్టికను రూపొందించింది. ఆ వివరాలను పరిశీలించిన పటేల్, తనకు ఇక అవసరం లేని రెండు సబ్స్క్రిప్షన్లను గుర్తించారు. వాటిని రద్దు చేయాలని ఏజెంట్‌కు సూచించడంతో ఆ ప్రక్రియను పూర్తి చేసి, రద్దుకు సంబంధించిన నిర్ధారణ ఈమెయిళ్లను కూడా పంపింది.





