ఎల్‌నినో ప్రభావంతో అంతర్జాతీయంగా సంక్షోభాలు తలెత్తుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో తక్షణ చర్యలకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉన్నందున, చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో సరైన కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) రూపొందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించకపోతే, భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని, గ్రామ స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేసి, అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాబోయే 8 నెలలు ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కీలకమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ 8 నెలల పాటు ప్రతి కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) రూపొందించాలని ఆదేశించారు.











