కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సంబంధించిన కీలక కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విదేశీ పర్యటన సందర్భంగా సిక్కుల భద్రత, మతపరమైన హక్కుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులు మైనారిటీల సమస్యలను ప్రస్తావించడం తప్పు కాదని, వారి వ్యాఖ్యలతో ఏకీభవించనంత మాత్రాన క్రిమినల్ కేసులు నమోదు చేయలేమని పేర్కొంది.
న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ డి. చౌహాన్ ఈ కేసును విచారించారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో మాట్లాడుతూ, భారత్‌లో సిక్కులు తలపాగా ధరించడానికి, గురుద్వారాలకు వెళ్లడానికి స్వేచ్ఛ ఉందా అనే అంశాన్ని ప్రస్తావించినట్లు పిటిషనర్లు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే అవకాశం ఉందని పేర్కొంటూ, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్లు కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే, ఈ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా లేదా ప్రజా శాంతికి భంగం కలిగించేలా ఉన్నట్లు ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు ఇలాంటి వ్యాఖ్యలకు రక్షణ ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఒక వ్యక్తి చేసిన ప్రసంగాన్ని మరొకరు తమ ప్రయోజనాల కోసం వక్రీకరించినంత మాత్రాన, ఆ ప్రసంగం చేసిన వ్యక్తిని బాధ్యుడిగా చేయలేమని హైకోర్టు పేర్కొంది.












