కామారెడ్డి, 2026-07-24
దోమకొండలో శుక్రవారం జరిగిన రెడ్డి సంఘాల ఐక్యవేదిక సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు నాగార్తి చంద్రారెడ్డి రెడ్డి కార్పొరేషన్‌కు పాలకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాలుగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పేద రెడ్డి యువతకు ఉపాధి, రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, విదేశీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించాలని ఆయన కోరారు.
దోమకొండ మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో శుక్రవారం రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మండల రెడ్డి సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు పన్యాల రామ్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించగా, రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగార్తి చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా, కామారెడ్డి జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు జూకంటి మోహన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పన్యాల రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో రెడ్డి సంఘాలను ఐక్యతతో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగార్తి చంద్రారెడ్డి మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో రెడ్డి సంఘాలు ఐక్యంగా ఉండి మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఏనుగు సంతోష్ రెడ్డి సంఘాల అభివృద్ధి, ఐక్యత కోసం పాదయాత్రలు, ఉద్యమాల ద్వారా విశేష కృషి చేశారని కొనియాడారు.












