మదనపల్లె, జూన్ 27
మదనపల్లి అన్నమయ్య జిల్లాలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, నైపుణ్యాభివృద్ధి సంస్థల జిల్లా అధికారులతో కలెక్టర్ నిశాంత్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. విద్యా ప్రమాణాలు, హాజరు, పర్యవేక్షణలో మెరుగైన ఫలితాలు సాధించాలని, నాణ్యమైన సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
పాఠశాలల నుంచి అంగనవాడీల వరకు నాణ్యమైన సేవలందించాలని, విద్యా ప్రమాణాలు, హాజరు, పర్యవేక్షణలో మెరుగైన ఫలితాలు సాధించాలని, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని, మానవ వనరుల అభివృద్ధి శాఖల్లో లక్ష్యాల సాధనకు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.
మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శనివారం ఆయన పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఇంటర్మీడియట్ విద్య, ఐసీడీఎస్, నైపుణ్యాభివృద్ధి సంస్థల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను సమీక్షించి, తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియను పారదర్శకంగా, సీనియారిటీ ఆధారంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల సంఖ్య పెరుగుదల, తగ్గుదల ఆధారంగా పాఠశాలల అవసరాలకు అనుగుణంగా సిబ్బంది సర్దుబాటు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో విద్యార్థుల ట్రాన్సిషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని, ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన స్థాయిలు (ఫౌండేషనల్ లెర్నింగ్ లెవెల్స్) పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి పాఠశాలలో తాగునీటి నాణ్యత పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత, పరిశుభ్రత, వంట ప్రక్రియను ఉపాధ్యాయులు మరియు హెడ్మాస్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి రోజు ఒక ఉపాధ్యాయుడు మధ్యాహ్న భోజనం పరిశీలించి నాణ్యతను నిర్ధారించాలని సూచించారు.












