ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో జలజీవన్ మిషన్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖా మంత్రి సవిత పరిశీలించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖా మంత్రి సవిత తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా జల జీవన్ మిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈనెల 5వ తేదీన ప్రొద్దుటూరులో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆమె డిసిఎంఎస్ చైర్మన్ జయప్రకాష్, టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, జనసేన నాయకులతో కలిసి పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.30 వేల కోట్లతో జల జీవన్ మిషన్ పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. రేపటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరవుతారని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సుమారు లక్ష మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భోజనం, రవాణా, ట్రాఫిక్, వైద్య, వసతి, మరుగుదొడ్ల ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కడప జిల్లాలో ఎయిర్పోర్ట్ టెర్మినల్ విస్తరణ, స్టార్టప్ కడప, ఇన్వెస్ట్ కడప, స్మార్ట్ కిచెన్లతో పాటు మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసి, పెట్టుబడులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.










