వైఎస్ఆర్ కడప జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఎన్నికల సన్నద్ధతపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 4,39,035 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ, జిల్లాలోని ఏడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కడప నగరపాలక సంస్థతో పాటు బద్వేల్, ఎర్రగుంట్ల, రాజంపేట, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు పట్టణాల్లో ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 4,39,035 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,12,807 మంది పురుషులు, 2,25,681 మంది మహిళలు, 547 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. కడప నగరపాలక సంస్థ పరిధిలో అత్యధికంగా 3,07,093 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మొత్తం 345 వార్డులకు గాను 172 వార్డుల్లో ఎన్నికల పోటీ జరగనుంది. మేయర్, చైర్పర్సన్ పదవులకు 23 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 313 మంది కలిపి మొత్తం 336 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జమ్మలమడుగులో అత్యధికంగా 28 వార్డులకు 98 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, కడపలో మేయర్ పదవికి 15 మంది, 14 వార్డులకు 48 మంది పోటీ పడుతున్నారు. పులివెందులలో చైర్పర్సన్ పదవికి ఇద్దరు, 20 వార్డులకు 54 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వివరించారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 272 ప్రాంతాల్లో 560 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 155 అత్యంత సమస్యాత్మక, 180 సమస్యాత్మక, 225 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు 335 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా 138 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వెలుపల నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు.





