ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జోహో, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరగడం, డేటా సెంటర్ల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడం, అంతర్జాతీయ పరిస్థితుల్లో అనిశ్చితి వంటి కారణాలతో ఈ ఏడాది ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు ఉండదని ప్రకటించింది. సంస్థ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఈ విషయాన్ని వెల్లడించారు.
సాఫ్ట్వేర్ రంగంలో వ్యాపార పరిస్థితులు ప్రస్తుతం అనిశ్చితంగా ఉన్నాయని, ఏఐ సేవల వినియోగం వేగంగా పెరుగుతుండటంతో సంస్థలపై ఖర్చుల భారం పెరుగుతోందని శ్రీధర్ వెంబు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు. డేటా సెంటర్లకు అవసరమైన సర్వర్ల ధరలు నాలుగు రెట్లు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ వినియోగానికి సంబంధించిన అదనపు వ్యయాలను నియంత్రించేందుకు సంస్థ చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా వ్యాపారంపై ప్రభావం చూపుతున్నాయని ఆయన వివరించారు. ఖర్చులను తగ్గించడంలో భాగంగా మార్కెటింగ్ బడ్జెట్‌ను కూడా కుదించినట్లు వెల్లడించారు. ఉద్యోగులకు సాధారణంగా ఇచ్చే వార్షిక జీతాల పెంపును ఈ ఏడాది అమలు చేయలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు.











