కేరళలోని కోడనాడ్ అభయారణ్యంలో సంరక్షణ పొందుతున్న 18 నెలల మాయ అనే పిల్ల ఏనుగును మెరుగైన వైద్యం కోసం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతార జంతు సంరక్షణ కేంద్రానికి విమానంలో తరలించారు. పుట్టుకతోనే ఎముకల బలహీనతకు సంబంధించిన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న మాయ, ఇటీవల ఆడుకుంటూ కిందపడటంతో తీవ్రంగా గాయపడింది.
దీంతో నిలబడలేని, నడవలేని పరిస్థితికి చేరుకుంది. వైద్యులు పరీక్షించి పలు ఎముకలు విరిగినట్లు, ఎముకల సాంద్రత తగ్గినట్లు గుర్తించారు. పరిస్థితి విషమించడంతో గతంలో వైద్య బృందం దయావధాన్ని కూడా సూచించింది. అయితే, వంతార వైద్య నిపుణులు చికిత్స అందించేందుకు ముందుకు రావడంతో మరోసారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 125 నుంచి 130 కిలోల బరువున్న మాయను క్రేన్ సాయంతో ప్రత్యేక జంతు అంబులెన్స్‌లోకి ఎక్కించి విమానాశ్రయానికి తరలించారు. ఈ ప్రక్రియలో పశువైద్యులు, అటవీశాఖ సిబ్బంది, చిన్నప్పటి నుంచి మాయను చూసుకుంటున్న సంరక్షకుడు కూడా వెంట వెళ్లారు. జామ్‌నగర్‌లోని వంతార కేంద్రంలో మాయకు హార్మోన్ చికిత్స, జలచికిత్సతో పాటు నిరంతర వైద్య పర్యవేక్షణ అందించనున్నారు. చికిత్సకు స్పందించే తీరును బట్టి నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చికిత్స ఖర్చు మొత్తాన్ని వంతార సంస్థే భరించనుంది. మాయ పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి కేరళకు తీసుకురావాలని అటవీశాఖ అధికారులు యోచిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి







