కడప, జులై 01
కడప నగర వన్ టౌన్ పోలీసులు బుధవారం ట్రాన్స్జెండర్లకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. సి.ఐ తిమ్మారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో చట్టానికి వ్యతిరేక చర్యలపై హెచ్చరికలు కూడా ఇచ్చారు.
కడప నగర వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం వన్ టౌన్ సి.ఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లకు (తృతీయ ప్రకృతి వ్యక్తులకు) చట్టాలపై అవగాహన, కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ తిమ్మారెడ్డి మాట్లాడుతూ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతకు, సమాజంలోని అన్ని వర్గాల రక్షణకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రోజు నిర్వహించిన కౌన్సిలింగ్ కార్యక్రమం ట్రాన్స్జెండర్లను ఇబ్బంది పెట్టడానికి కాదని, వారికి సమాజంలో ఎటువంటి వేధింపులు ఎదురైనా పోలీస్ శాఖ తక్షణమే స్పందిస్తుందని భరోసా ఇచ్చారు. ట్రాన్స్జెండర్లకు ఏదైనా సమస్య తలెత్తితే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అదే సమయంలో, వివాహాలు, శుభకార్యాలు, వ్యాపార సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సి.ఐ హెచ్చరించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, ప్రజా శాంతికి భంగం కలిగించడం లేదా ఇతరులపై దాడులకు పాల్పడటం వంటి చర్యలు చట్టరీత్యా నేరమని, వీటికి కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. సమాజంలో అందరిలాగే చట్టానికి లోబడి సాధారణ, గౌరవప్రదమైన జీవితాన్ని సాగించాలని ఆయన కోరారు. ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, వ్యాపార ప్రాంతాల వద్ద నిరంతరం పోలీస్ నిఘా ఉంటుందని తెలిపారు. మొదటి విడతగా కౌన్సిలింగ్ నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని, ఆ తర్వాత కూడా పద్ధతి మార్చుకోకుండా ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సీఐ తిమ్మారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడప వన్ టౌన్ సి.ఐ ఎం.తిమ్మారెడ్డి తో పాటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు.












