నంద్యాల, జూలై 04
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని 'ఫ్యాప్టో' (ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్) ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని వారు మంత్రిని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని నంద్యాలలోని వారి క్యాంపు కార్యాలయంలో ‘ఫ్యాప్టో’ (ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్) ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న టెట్ సమస్యను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
విద్యా హక్కు చట్టం-2009, ఎన్.సి.టి.ఇ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని, అయితే సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ఇన్-సర్వీస్ టీచర్లు కూడా టెట్ పాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దీనివల్ల సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కావున, ఉపాధ్యాయుల ప్రయోజనాల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23(1) ని సవరించేలా చొరవ చూపాలని వారు మంత్రి ఫరూక్ ని కోరారు. అలాగే, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టెట్ పరీక్షను నిర్వహించాలని, ఇందులో 40 శాతం అర్హత మార్కులు ఉండేలా మరియు వారి బోధనాంశాల ఆధారంగా సిలబస్ రూపొందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.












