కేరళలో విద్యుత్ కొరతను కృత్రిమంగా సృష్టించారని, ప్రైవేటు సంస్థల ద్వారా విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో పారదర్శకత లోపించిందని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో ముఖ్యమంత్రి నేరుగా జోక్యం చేసుకోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
విద్యుత్ శాఖ, కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు (కేఎస్ఈబీ) అభ్యంతరాలను పక్కనపెట్టి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని విమర్శించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు, అధికారుల అభ్యంతరాలు, ఒప్పంద వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కేఎస్ఈబీ అధ్యయనం ప్రకారం ప్రతిపాదిత విద్యుత్ కొనుగోలు వల్ల రాష్ట్రానికి అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని విజయన్ పేర్కొన్నారు. జీఎన్ఏ ఎనర్జీ అనే ప్రైవేటు సంస్థ విద్యుత్ ను ఉత్పత్తి చేసే కంపెనీ కాదని, కొనుగోలుదారులను, విక్రయదారులను అనుసంధానించే డిజిటల్ విద్యుత్ వ్యాపార వేదిక మాత్రమేనని గుర్తు చేశారు. ఆ సంస్థ ద్వారా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించిన కేఎస్ఈబీ మాజీ ఛైర్మన్ ఎం.జీ. రాజమాణిక్యంను బదిలీ చేయడం వెనుక ఒత్తిళ్లు ఉన్నాయని కూడా ఆరోపించారు. మరోవైపు, ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు యూనిట్ కు రూ.14.50 చెల్లించాల్సి ఉండగా, జీఎన్ఏ ద్వారా యూనిట్ కు రూ.8.63 నుంచి రూ.8.90కే విద్యుత్ లభిస్తుందని వివరించారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి సుమారు రూ.2,232 కోట్ల ఆదా అవుతుందని పేర్కొన్నారు.












