తెలంగాణ రాష్ట్రంలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం లభించడంతో, త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టుతో జిల్లా పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభించనుంది.
తెలంగాణలో విమానయాన సౌకర్యాలను విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతులు లభించి, భూసేకరణ పనులు జరుగుతుండగా, తాజాగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్థానిక ఎంపీ గోడం నరేష్ మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం మాత్రమే ప్రయాణికుల సేవలో ఉంది. వరంగల్, కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్ట్‌లకు అనుమతులు రాగా, ఇప్పుడు ఆదిలాబాద్‌లోనూ విమానాశ్రయం ఏర్పాటు కానుంది. ఇది జిల్లా పారిశ్రామికాభివృద్ధికి, ప్రజల రాకపోకలకు ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఎంపీ గోడం నరేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరించారు. విమానాశ్రయ అధికారులు రంగంలోకి దిగాక మాస్టర్ ప్లాన్‌లో మార్పులు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుందని, దీని కోసం మరో 10 వేల ఎకరాలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు.
త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభమవుతాయని ఎంపీ నరేష్ తెలిపారు. ఈ విమానాశ్రయం రావడం జిల్లా ప్రజల దశాబ్దాల కోరిక నెరవేర్చడమేనని, దీనివల్ల స్థానిక వ్యాపారులు, ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

