తిరుపతి, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, పుత్తూరు మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., తెలిపారు. ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పుడు ప్రచారాలు, అసత్య సమాచారంతో సెన్సేషన్ సృష్టిస్తే కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు.
తిరుపతి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను, అక్కడ చేపట్టిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. ఎన్నికల భద్రతలో భాగంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులను అందుబాటులో ఉంచారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అదనపు ఎస్పీ స్థాయి అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ, ఎన్నికల సమయంలో ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా, తప్పుడు సమాచారంతో గందరగోళం సృష్టించేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 39వ వార్డుకు సంబంధించి భర్త కిడ్నాప్ అయ్యాడంటూ ఉదయాన్నే ప్రచారం చేసి సెన్సేషన్ సృష్టించిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని తెలిపారు. సంబంధిత వ్యక్తులతో మాట్లాడి వివరాలు సేకరించగా, సదరు వ్యక్తి స్వయంగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని వెళ్లినట్లు వెల్లడైందని, ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో తప్పుడు సమాచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టించిన చర్యలపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి () ఉల్లంఘన కింద కేసు నమోదు ట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, ప్రభావితం చేయడం, బెదిరించడం లేదా ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా నిర్ధారణ లేని సమాచారాన్ని, అసత్య ప్రచారాలను వ్యాప్తి చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని సూచించారు. ప్రజలకు లేదా ఓటర్లకు ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని, సమస్యల పరిష్కారానికి పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు, ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. స్పష్టం చేశారు.











