నేర విచారణల్లో చేతిరాత నిపుణుల నివేదికలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద పత్రంపై ఉన్న చేతిరాత ఒక వ్యక్తిదేనని నిర్ధారించేందుకు నిపుణుడు ఇచ్చిన నివేదికను మాత్రమే ఆధారంగా తీసుకోరాదని స్పష్టం చేసింది. ఆ నివేదికను సమర్పించిన చేతిరాత నిపుణుడిని కోర్టులో సాక్షిగా విచారించాలని, నిందితుడికి ఆయనను ప్రశ్నించే అవకాశం కల్పించాలని పేర్కొంది.
జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. చేతిరాత పోలిక అనేది పూర్తిగా కచ్చితమైన శాస్త్రం కాదని, ఒకే విషయాన్ని నిపుణులు వేర్వేరు విధాలుగా విశ్లేషించే అవకాశం ఉంటుందని తెలిపింది. అందువల్ల నిపుణుడి అభిప్రాయాన్ని ఎదురు ప్రశ్నల ద్వారా పరీక్షించిన తర్వాతే దానిని సాక్ష్యంగా పరిగణించాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భార్య ఆత్మహత్య కేసులో అప్పీల్
రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిపై తన భార్య ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలు వచ్చాయి. భర్త వేధింపులకు గురిచేశాడని, అసభ్య పదజాలం, బెదిరింపులతో కూడిన నాలుగు లేఖలు పంపించాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ లేఖల ఆధారంగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి, పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. హైకోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది.












