అమరావతి, జూన్ 29
రాజ్యాంగ విలువలు, న్యాయపాలన పరిరక్షణలో జస్టిస్ రఘునందన్ రావు సేవలు చిరస్మరణీయం అని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ అభినందించారు. హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ రఘునందన్ రావు పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
రాజ్యాంగ విలువలు, న్యాయపాలన పరిరక్షణలో జస్టిస్ రఘునందన్ రావు సేవలు చిరస్మరణీయం అని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ అభినందించారు.
హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ రఘునందన్ రావు పదవీ విరమణ సందర్భంగా సోమవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
ఈ వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ, జస్టిస్ రఘునందన్ రావు న్యాయ ప్రస్థానం, న్యాయపరమైన నిష్పాక్షికత, రాజ్యాంగ విలువల పట్ల అచంచల నిబద్ధత, న్యాయవ్యవస్థ ఆధునీకరణలో ఆయన చేసిన విశిష్ట కృషిని కొనియాడారు.
న్యాయవాదిగా విశేష అనుభవాన్ని సంపాదించిన తదుపరి న్యాయమూర్తిగా ధర్మాసనాన్ని అలంకరించి, రాజ్యాంగ స్ఫూర్తిని, న్యాయపాలనను అత్యున్నత ప్రమాణాలతో పరిరక్షించారని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన అంశాలు, సంక్లిష్టమైన సివిల్ వివాదాలు, పన్నుల సంబంధిత కేసులు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వంటి అనేక కీలక అంశాల్లో ఆయన వెలువరించిన తీర్పులు న్యాయవ్యవస్థకు మార్గదర్శకంగా నిలుస్తాయని జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు.
తన పదవీకాలంలో సుమారు 25 వేల కేసులను వేగవంతంగా, సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా జస్టిస్ రఘునందన్ రావు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశారని ఆమె పేర్కొన్నారు. న్యాయపరమైన బాధ్యతలతో పాటు పరిపాలనా వ్యవహారాల్లోనూ ఆయన అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శించారు. న్యాయస్థానాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, సమాచార సాంకేతికత వినియోగం, న్యాయ ప్రక్రియల డిజిటలైజేషన్, న్యాయసేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.
పరిపాలనా కమిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ, నియామకాలు, బదిలీలు, న్యాయస్థానాల కంప్యూటరీకరణ, ఆర్థిక వ్యవహారాలు, హైకోర్టు పరిపాలన తదితర కీలక కమిటీలలో ఆయన పోషించిన పాత్ర ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ అభివృద్ధికి బలమైన పునాదులు వేసిందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.
వీడ్కోలు సందర్భంగా జస్టిస్ రఘునందన్ రావు మాట్లాడుతూ, న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన రాజ్యాంగ ప్రమాణాన్ని తన పదవీకాలమంతా నిబద్ధతతో పాటించేందుకు కృషి చేశానని తెలిపారు. న్యాయమూర్తిగా పని చేసిన ఈ ఆరున్నర సంవత్సరాలు తన జీవితంలో అత్యంత విలువైన అనుభవాలను అందించాయని పేర్కొన్నారు. న్యాయస్థానమే తమకు మొదటి చివరి ఆశ్రయంగా భావించే సాధారణ ప్రజల బాధలు, వారి న్యాయపోరాటాన్ని దగ్గరగా అర్థం చేసుకునే అవకాశం తనకు లభించిందన్నారు.
తమ హక్కులను కాపాడుకునేందుకు మరే ప్రత్యామ్నాయం లేని ప్రజలకు హైకోర్టే చివరి ఆశ్రయం అన్నారు. అలాంటి ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను పరిరక్షించడం న్యాయవ్యవస్థ యొక్క అత్యున్నత బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. న్యాయమూర్తుల గౌరవం వారి పదవుల వల్ల కాకుండా, న్యాయం కోసం ఆశ్రయించిన ప్రతి వ్యక్తికి ఎంత నిబద్ధతతో న్యాయం చేశామనే దానిపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
న్యాయ వ్యవస్థ ప్రభుత్వంతో కలిసి పని చేయడంతో పాటు రాజ్యాంగాన్ని, న్యాయపాలనను పరిరక్షించడానికి, ప్రభుత్వ చర్యల వల్ల పౌరుల హక్కులు ఉల్లంఘించబడకుండా కాపాడటానికే న్యాయస్థానాలు ఉన్నాయని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
ఉమ్మడి హైకోర్టు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ, న్యాయస్థానాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, త్వరలో అందుబాటులోకి రానున్న నూతన హైకోర్టు భవనం, గత రెండేళ్లుగా నమోదైన కేసుల కంటే ఎక్కువ కేసులను పరిష్కరించిన ఘనత, జాతీయ స్థాయిలో న్యాయవ్యవస్థ పని తీరుకు లభించిన గుర్తింపును జస్టిస్ రఘునందన్ రావు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. దేశంలోని అత్యుత్తమ హైకోర్టుల సరసన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును నిలబెట్టేందుకు రాబోయే తరాలు మరింత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తన ప్రసంగం ముగింపులో పరమపూజ్య దలైలామా సందేశాన్ని ఉటంకిస్తూ, "ఈ భూమిపై మనం అతిథులమని, మన జీవితకాలంలో ఇతరులకు ఉపయోగపడే, వారి సంతోషానికి దోహదపడే మంచి పనులు చేయడమే జీవితానికి నిజమైన అర్థం" అని పేర్కొన్నారు. ఈ మహోన్నత న్యాయస్థానంలో సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజల రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఎల్లప్పుడూ నిబద్ధతతో ముందుంటుందనే దృఢ విశ్వాసంతో ధర్మాసనం నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని జస్టిస్ రఘునందన్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా అడిషినల్ సోలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభునాథ్ వాసిరెడ్డి, ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ధ్వారకానాథ్ రెడ్డి తదితరులు జస్టిస్ రఘునందనరావుకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ తమ అనుభవాలను పంచుకున్నారు.
ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.









