డిస్ట్రిక్ట్ బ్యూరో ఇంచార్జ్ కడప డాక్షిన్ టైమ్స్ సెప్టెంబర్ 11: కడప జిల్లా నందలూరు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అరవపల్లి రైల్వే గేటు సమీపంలో ఉన్న జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఉదయం సుమారు 4 గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన ఇంటి యజమాని వెంటనే బయటకు వచ్చి చుట్టుపక్కల వారికి, రాజంపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రాజంపేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
అయితే ఫైర్ ఇంజన్ లో ఉన్న నీరు మధ్యలోనే అయిపోవడంతో సిబ్బంది నీటిని నింపుకునేందుకు వెళ్లారు. తిరిగి వచ్చేలోపే మంటలు మరింత ఉధృతమై దుకాణం మొత్తాన్ని చుట్టుముట్టాయి. ఉదయం 4:10 గంటలకు మొదలైన మంటలు 7 గంటల వరకు అదుపులోకి రాలేదు.
మరో ఫైర్ ఇంజన్ ను పంపాలని బాధితులు ఫైర్ స్టేషన్ సీఐ రాధాకృష్ణను ఎంత వేడుకున్నా రాజంపేటలో ఒక్క ఇంజన్ మాత్రమే ఉందని, కడప నుంచి రావాలంటే సమయం పడుతుందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని సుమారు రూ.10 లక్షల విలువైన సరుకు పూర్తిగా దగ్ధమైందని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.