భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని, ఏఐ అభివృద్ధిలో సామాజిక బాధ్యత కూడా అత్యంత ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను ఆయన ప్రారంభించారు.
ఈ సమ్మిట్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మానవ మేధస్సు నిప్పురవ్వను కనిపెట్టినప్పటి నుంచి నేటి ఏఐ యుగం వరకు ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.
ప్రపంచ జనాభాలో ఆరో వంతు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, ఏఐకి కేంద్రంగా భారత్ మారుతోందని ఆయన పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతను నియంత్రించాల్సిన బాధ్యత మానవులదేనని, ఈ సమ్మిట్ కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుందని ప్రధాని అన్నారు.
ఏఐ సమ్మిట్ నిర్వహణ భారతదేశానికే కాకుండా, దక్షిణాసియాకు కూడా గర్వకారణమని తెలిపారు. యువత ఏఐని ప్రయోజనకరంగా ఉపయోగిస్తోందని, అయితే ఏఐ అనేది కత్తికి రెండు వైపులా పదునున్న అస్త్రమని ఆయన హెచ్చరించారు.
భారతదేశానికి యువత నూతన శక్తిగా, ఆస్తిగా మారారని, ఏఐ సాంకేతికత వినియోగం, దాని ఫలితాలపై తుది నిర్ణయం మానవులదే అయి ఉండాలని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.

