విజయవాడ గ్రామీణం, జూన్ 30
దేశ విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. పరీక్షా పత్రాల లీకులు, నియామకాల్లో జాప్యంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
దేశ విద్యావ్యవస్థ ఐసీయూలో ఉందని, దానిని కాపాడటం అందరి బాధ్యత అని యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ కాంగ్రెస్ కార్యాలయంలో 'ఛాత్రోన్ కీ గూంజ్' (విద్యార్థుల గర్జన) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా డోన్ నుంచి తెలుగు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగ మధు యాదవ్, ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామారావు, నూతనంగా నియమితులైన నూనె పవన్ తేజ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగు విజయ్ కుమార్ లు దేశ విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభంపై గళమెత్తారు.
మోదీ ప్రభుత్వ హయాంలో పరీక్షా పత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, నియామక ప్రక్రియల్లో జాప్యాల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అయినా కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ రాజీనామా చేయకుండా మొండి వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం విద్యార్థులకు ఎటువంటి హామీలు ఇవ్వడం లేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.












