హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు ప్రవేశపెట్టిన ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. అధిక ధరల కారణంగా సాధారణ ప్రయాణికులకు ఆర్థిక భారం అవుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని తెలిపారు.
ప్రస్తుతం రోజువారీ ఉమ్మడి పాస్ ధర రూ.400గా ఉంది. ఇందులో మెట్రో ప్రయాణానికి రూ.300, ఆర్టీసీ బస్సు ప్రయాణానికి రూ.100 కేటాయించారు. నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించారు. ఇందులో మెట్రో వాటా రూ.7,000 కాగా, ఆర్టీసీ వాటా రూ.1,500గా ఉంది. ఈ ధరలు తమకు అందుబాటులో లేవని, సాధారణ టికెట్లతో ప్రయాణించడం కొన్ని సందర్భాల్లో తక్కువ ఖర్చుతో పూర్తవుతోందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచనల మేరకు ధరలపై పునఃపరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ఆర్టీసీ మరియు మెట్రో సేవలను ఎక్కువ మంది వినియోగించేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ప్రయాణికులకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించేలా, అందుబాటు ధరల్లో ఉమ్మడి పాస్‌ను అమలు చేసేందుకు తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.











