దేశంలో రూపాయి విలువ పతనం, పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ పరిణామాలు ద్రవ్యోల్బణానికి దారితీస్తాయని, సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
డాలర్‌తో రూపాయి విలువ బలహీనపడి 100 వైపు పయనించడం, పారిశ్రామిక ఇంధన ధరల పెరుగుదల వంటివి కేవలం గణాంకాలు కాదని, రాబోయే ద్రవ్యోల్బణానికి స్పష్టమైన సంకేతాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రభుత్వం వీటిని 'సాధారణం' అని చెప్పినా, వాస్తవంలో ఉత్పత్తి, రవాణా ఖర్చులు పెరిగి MSMEలు దెబ్బతింటాయని ఆయన అన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని, విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FII) వెనక్కి వెళ్లడం వల్ల షేర్ మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతుందని ఆయన తెలిపారు. దీని ప్రభావం ప్రతి కుటుంబంపై నేరుగా, లోతుగా పడుతుందని, దీనికి ఎక్కువ సమయం పట్టదని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్, LPG ధరలు కూడా పెంచుతారని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వం వద్ద సరైన దిశ, వ్యూహం లేవని, కేవలం మాటలే ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం ఏం చెబుతుందనేది కాదని, ప్రజల జేబులో ఎంత మిగులుతుందనేదే అసలు ప్రశ్న అని ఆయన స్పష్టం చేశారు.










