భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. దేశంలో మహిళల అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమై నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అప్పటి తొలి మహిళా జట్టు వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. 1971లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో భారత మహిళల అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానం మొదలైంది.
భారత మహిళల తొలి అంతర్జాతీయ టెస్టు జట్టుకు శాంతా రంగస్వామి నాయకత్వం వహించారు. ఆ మ్యాచ్‌లో ఆడిన 11 మంది సభ్యులు: సంధ్యా మజుందార్, శోభా పండిట్, ఫౌజియా ఖలీలీ, సుధా షా, కెప్టెన్ శాంతా రంగస్వామి, ఉజ్వల నికమ్, శుభాంగి కులకర్ణి, సుసన్ ఇట్టిచెరియా, డయానా ఎడుల్జీ, శర్మిలా చక్రవర్తి, బెహ్రోజ్ ఎడుల్జీ.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బెంగళూరులో జరిగిన ఈ తొలి టెస్టులో వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు చేసింది. భారత బౌలర్ శుభాంగి కులకర్ణి ఐదు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నారు. అనంతరం భారత్ 269/6 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శోభా పండిట్ 69, శాంతా రంగస్వామి 74 పరుగులతో రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 175/7 వద్ద డిక్లేర్ చేయగా.. మ్యాచ్ డ్రాగా ముగిసింది.












