ఉత్తర్ ప్రదేశ్లోని షామ్లీలో ఒక హిందూ యువకుడు ఇస్లాం మతాన్ని స్వీకరించి, ముస్లిం మహిళను వివాహం చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు మత మార్పిడి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, యువకుడి భార్య, ఆమె తండ్రిని అరెస్టు చేశారు.
షామ్లీకి చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ వ్యాపారవేత్త దేవరాజ్ మాలిక్ కుమారుడు, 30 ఏళ్ల ఆయుష్ మాలిక్ ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు సమాచారం. ఈద్ రోజున అతను నమాజ్ చేస్తున్న ఫోటోలు వైరల్ కావడంతో హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు.
మతం మారిన తర్వాత మహమ్మద్ అలీగా పేరు మార్చుకున్న ఆయుష్, తాను స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, తన భార్య కోసం న్యాయ పోరాటం చేస్తానని తెలిపాడు. అయితే, కుటుంబ సభ్యులు మాత్రం తమ ఆస్తులను కాజేయాలనే ఉద్దేశంతోనే ఆయుష్ను మతం మార్చారని ఆరోపించారు.
షామ్లీ ఎస్పీ ఎన్పీ సింగ్ కథనం ప్రకారం, ఆయుష్కు చాందిని ఖురేషితో ఆమె సోదరుడు ఆస్ మహమ్మద్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ వ్యవహారంలో చాందినితో పాటు మరో 8 మందిపై కేసు నమోదైనట్లు తెలిపారు.
ఆయుష్ తన చర్యలను సమర్థించుకుంటూ, చిన్నప్పటి నుంచే ఇస్లాం పట్ల ఆకర్షితుడనని, నాలుగేళ్ల క్రితం మతం మారి, చాందినిని వివాహం చేసుకున్నానని తెలిపాడు. తాము మేజర్లమని, చట్టపరంగా తమకు పూర్తి హక్కులు ఉన్నాయని పేర్కొన్నాడు.












