శ్రీసిటీలోని టాబ్లెట్స్ ఇండియా లిమిటెడ్ (టిల్) ఔషధ తయారీ పరిశ్రమలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సుమారు 8.30 గంటలకు బాయిలర్ పేలడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని అధికారులు తెలిపారు.
రెండు టన్నుల సామర్థ్యం గల బాయిలర్ ఆకస్మికంగా పేలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి బాయిలర్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, ఎగసిపడిన శిథిలాలు తగలడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు బాయిలర్ ఆపరేటర్, ఇద్దరు ఈటీపీ సిబ్బంది, మరో ఇద్దరు కార్మికులు ఉన్నారు. మృతుల్లో ఒకరు కోల్‌కతాకు, ఇద్దరు తమిళనాడుకు, మరో ఇద్దరు చెర్వి, తడ ప్రాంతాలకు చెందిన స్థానికులుగా అధికారులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై స్పందించి, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం రెండు రోజుల్లో అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. మృతుల పిల్లల ఉన్నత విద్యతో పాటు విద్యా ఖర్చులను శ్రీసిటీ యాజమాన్యం భరిస్తుందని, అర్హులైన కుటుంబ సభ్యులకు శ్రీసిటీ లేదా పరిసర పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ కోసం బాయిలర్, ఫ్యాక్టరీస్, పరిశ్రమలు, పోలీస్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన తిరుపతి బాయిలర్ ఇన్స్పెక్టర్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీసిటీలో గత 18 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారి అని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు పునరావృతం కాకుండా శ్రీసిటీలోని అన్ని పరిశ్రమల్లో థర్డ్‌పార్టీ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, శ్రీసిటీ ఎండీ రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












