నాలుగు నెలల గర్భవతి అయిన భార్యపై భర్త కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, 8 నెలల క్రితం కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్‌కు చెందిన వైష్ణవి (19) ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మాదాపూర్‌లోనే నివాసం ఉంటున్నారు. హరిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద పద్ధతిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వైష్ణవి యూట్యూబ్ ఛానల్ నడుపుతూ, రీల్స్ చేస్తూ ఉండేది.
గత కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు హరిబాబు, వైష్ణవిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
ఉదయం కుటుంబసభ్యులు వైష్ణవిని రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, నిందితుడైన హరిబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనతో మాదాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.












