దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో దాదాపు మూడు నెలల పాటు కొట్టుకుపోయిన ఐదుగురు వ్యక్తులు చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. కిరిబాటి దేశానికి చెందిన ఫానింగ్ ద్వీపం సమీపంలో వీరిని స్థానిక గ్రామస్థులు గుర్తించి రక్షించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు పెద్దలు ఉన్నారు. అయితే వీరితో పాటు ప్రయాణించిన మరో నలుగురి ఆచూకీ ఇంకా తెలియలేదు.
ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియాలోని మురిలో, రువో ద్వీపాల మధ్య సాధారణంగా గంటలో పూర్తయ్యే ప్రయాణం కోసం తొమ్మిది మంది జులై 30, 2026న చిన్న పడవలో బయలుదేరారు. మార్గమధ్యంలో తుఫాను రావడంతో వారి పడవ అదుపు తప్పి సముద్రంలో కొట్టుకుపోయింది. వారు తిరిగి రాకపోవడంతో అమెరికా కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందింది. దీంతో వారు సుమారు 10 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 85,700 చదరపు కిలోమీటర్ల సముద్ర ప్రాంతాన్ని పరిశీలించినప్పటికీ పడవ ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలను నిలిపివేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆదివారం కిరిబాటిలోని ఫానింగ్ ద్వీపం సమీపంలో సముద్రంలో కొట్టుకువస్తున్న పడవను స్థానిక గ్రామస్థులు గుర్తించారు. అందులో ఉన్న ఐదుగురిని ఒడ్డుకు తీసుకొచ్చి రక్షించారు. మైక్రోనేషియా నుంచి దాదాపు 5,400 కిలోమీటర్ల దూరం సముద్రంలో ప్రయాణించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.












