ఎన్నికల హామీల అమలు కోరుతూ 'ఛలో విజయవాడ'కు తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులపై చంద్రబాబు ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలను అక్రమంగా అరెస్టు చేయడం హేయమని ఆయన అభివర్ణించారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి 'ఎక్స్' వేదికగా చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం అంగన్వాడీ కార్యకర్తల తప్పా అని ప్రశ్నించారు. రెండేళ్లు గడుస్తున్నా హామీల అమలులో జాప్యంపై ప్రశ్నించడం నేరమా అని ఆయన నిలదీశారు.
మహిళలని కూడా చూడకుండా వారిపై లాఠీఛార్జీ చేయడం, బలప్రయోగం చేయడం, నిర్బంధించడం, కనీస సౌకర్యాలు లేకుండా చేయడం అత్యంత అమానవీయమని జగన్ విమర్శించారు. చర్చలకు పిలుస్తామని చెప్పి, ముందు రోజు రాత్రే విద్యుత్ సరఫరా నిలిపివేసి, కంచెలు వేసి, ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణమని పేర్కొన్నారు.
చంద్రబాబు వెంటనే అంగన్వాడీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలని, వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని జగన్ డిమాండ్ చేశారు. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులకు సహా వివిధ వర్గాల వారికి చేస్తున్న అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని, దీనికి తప్పకుండా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

