ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులు, బాధిత కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర, జాతీయ విపత్తు సహాయ నిధుల కింద పరిహారాన్ని గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరణించిన వారికి గతంలో రూ.4 లక్షలు ఇవ్వగా, ఇప్పుడు రూ.8 లక్షలకు పెంచారు. పంట నష్టపరిహారాన్ని కూడా 25-30 శాతం వరకు పెంచారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
సాగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో పంట నష్టానికి హెక్టారుకు ఇచ్చే పరిహారాన్ని రూ.17,000 నుంచి రూ.22,000కు పెంచారు. వర్షాధార ప్రాంతాల్లో ఈ మొత్తాన్ని రూ.8,500 నుంచి రూ.11,000కు పెంచారు. శాశ్వత పంటలు, వ్యవసాయ అటవీ పంటలకు రూ.22,500 బదులు రూ.30,000 అందించనున్నారు. పొలాల్లో పేరుకుపోయిన మట్టి, ఇసుక తొలగింపునకు ఇచ్చే సాయాన్ని రూ.18,000 నుంచి రూ.23,000కు పెంచారు. కొండచరియలు, మంచు చరియల వల్ల భూమి దెబ్బతింటే ఇచ్చే పరిహారాన్ని రూ.47,000 నుంచి రూ.60,000కు పెంచారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పశువులు, కోళ్ల పెంపకందారులకు కూడా అదనపు సాయం ప్రకటించారు. ప్రకృతి విపత్తుల్లో ఆవులు, గేదెల వంటి పెద్ద పశువులు మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.40,000 నుంచి రూ.50,000కు పెంచారు. మేకలు, గొర్రెలు, పందుల వంటి చిన్న పశువులకు రూ.4,000 బదులు రూ.5,500 ఇవ్వనున్నారు. గుర్రాలు, కంచర గాడిదలు వంటి రవాణా పశువులకు రూ.20,000 నుంచి రూ.25,400కు పెంచారు. కోళ్లు మరణిస్తే ఒక్కో కోడికి ఇచ్చే పరిహారాన్ని రూ.100 నుంచి రూ.130కు పెంచారు.












