జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. పోటీల 11వ రోజైన భారత కంపౌండ్ ఆర్చర్లు మూడు స్వర్ణ పతకాలను సాధించి సంచలనం సృష్టించారు. మహిళల జట్టు, మిక్స్డ్ జట్టు, పురుషుల జట్టు విభాగాల్లో భారత్ స్వర్ణ పతకాలను గెలుచుకుంది.
మహిళల కంపౌండ్ జట్టు ఫైనల్లో జ్యోతి సురేఖ వెన్నం, చికితా తనిపర్తి, పృథికా ప్రదీప్‌లతో కూడిన భారత బృందం చైనాపై 238-234 తేడాతో విజయం సాధించింది. భారత బృందం నమోదు చేసిన 238 పాయింట్లు ప్రపంచ రికార్డును సమం చేశాయి. దీంతో మహిళల జట్టు గత ఆసియా క్రీడల్లో సాధించిన టైటిల్‌ను నిలబెట్టుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆ తర్వాత మిక్స్డ్ కంపౌండ్ జట్టు విభాగంలో చికితా తనిపర్తి, సాహిల్ జాదవ్ జోడీ స్వర్ణం సాధించింది. దక్షిణ కొరియాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ 157-157తో సమం కావడంతో షూట్‌ఆఫ్‌కు వెళ్లింది. షూట్‌ఆఫ్‌లో భారత జోడీ కీలక సమయంలో 10 పాయింట్లను సాధించగా, ప్రత్యర్థి చివరి బాణం 9 పాయింట్ల వద్ద నిలిచింది. దీంతో భారత్ విజేతగా నిలిచింది. ఈ విజయంతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో తొలిసారి జరగనున్న కంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్‌కు భారత్ కోటా స్థానాన్ని కూడా సాధించింది.











