చెరకు రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో రైతు సంఘాలు ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించాయి. చక్కెర కనీస విక్రయ ధర పెంపు, గిట్టుబాటు ధర కల్పన సహా పలు డిమాండ్లతో అక్టోబర్ 13న జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని సంఘాలు ప్రకటించాయి.
సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన చెరకు రైతుల ప్రతినిధులతో సమావేశం జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న ధరల సమస్యలు, చక్కెర కర్మాగారాల్లో చెరకు తూకం, చక్కెర దిగుబడి లెక్కల్లో తలెత్తుతున్న వ్యత్యాసాలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రైతుల సమస్యలను పరిశీలించేందుకు ఉన్నతస్థాయి సంయుక్త కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే, తక్షణమే ధరల విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్న రైతు నాయకులు ఈ ప్రతిపాదనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ ఏర్పాటు హామీతో తమ ప్రధాన డిమాండ్లకు వెంటనే పరిష్కారం లభించదని వారు అభిప్రాయపడ్డారు.











