ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని కేసు నుండి విముక్తి (డిశ్చార్జ్) చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకులకు ఊరట లభించింది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుండి విముక్తి (డిశ్చార్జ్) చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2021-22లో ప్రవేశపెట్టిన ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని CBI, ED కేసులు నమోదు చేశాయి.
స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ నేడు వెలువరించిన తీర్పులో CBI వాదనలను కోర్టు తోసిపుచ్చింది. నిందితులకు వ్యతిరేకంగా ఎటువంటి "బలమైన ఆధారాలు" లేవని, కేవలం ఊహాగానాల ఆధారంగా కుట్ర కోణాన్ని సృష్టించలేమని కోర్టు స్పష్టం చేసింది. CBI దాఖలు చేసిన ఛార్జిషీట్లో పొంతన లేదని, సాక్షుల వాంగ్మూలాలకు, సాక్ష్యాలకు మధ్య సంబంధం లేదని కోర్టు అభిప్రాయపడింది.
దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని గుర్తిస్తూ, విచారణాధికారిపై శాఖాపరమైన విచారణకు కూడా కోర్టు ఆదేశించడం గమనార్హం. ఈ కేసులో డిశ్చార్జ్ అయిన వారిలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు బీఆర్ఎస్ నేత కె. కవిత, AAP కమ్యూనికేషన్స్ ఇన్-ఛార్జ్ విజయ్ నాయర్, AAP ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ తీర్పు AAPకి రాజకీయంగా పెద్ద ఊరటనిచ్చింది.










