ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వేడుకల్లో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య జరిగిన వాగ్వాదం భక్తులను విస్మయానికి గురిచేసింది.
బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం, అర్చకులు పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్నికి అందజేశారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే కొలికపూడి, తనకు కూడా పట్టువస్త్రాలు ఇవ్వాలని పురోహితులను కోరారు. అయితే, పట్టువస్త్రాలు ఒకరికే ఇచ్చే అవకాశం ఉందని అర్చకులు తెలిపారు. దీనికి బదులుగా, ఎమ్మెల్యేకు ముత్యాల తలంబ్రాలను గౌరవంగా అందించారు.
ఎంపీకి ప్రాధాన్యత ఇవ్వడాన్ని సహించలేని ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని చేతిలో ఉన్న పట్టువస్త్రాలను అందరూ చూస్తుండగానే బలవంతంగా లాక్కున్నారని సమాచారం. ఈ ఊహించని పరిణామంతో ఎంపీ చిన్నితో పాటు అక్కడున్న భక్తులు, పార్టీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారని తెలిసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 'దేవుడి సన్నిధిలో కూడా ఇలాంటి రాజకీయ కీచులాటలా?' అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఈ సంఘటనతో ఎంపీ కేశినేని చిన్ని పరువు పోయిందని ఆయన వ్యతిరేక వర్గం వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి నుంచి ఎమ్మెల్యే ఇలా వస్త్రాలు లాక్కోవడం ప్రోటోకాల్ ఉల్లంఘనతో పాటు వ్యక్తిగత అహంకారానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి.










