ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తిరుమల లడ్డు వివాదంపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లడ్డుపై స్వల్పకాలిక చర్చకు కూటమి ప్రభుత్వం భయపడుతోందని, చర్చ జరగకుండా కాలయాపన చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, తిరుమల లడ్డుపై చర్చ జరగకుండా స్టేట్మెంట్లు ఇస్తూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయో వినే ఓపిక ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. తమ అభిప్రాయాలు చెప్పనివ్వకుండా గొంతు నొక్కొద్దని, బుధవారం నాడు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మరో ఎమ్మెల్సీ కుంభారవి మాట్లాడుతూ, చంద్రబాబు లడ్డు అపవిత్రంగా మారిపోయిందని ఆరోపించడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు నిజానిజాలు తెలియజేయాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీపై ఉందని, చంద్రబాబు శ్రీవారి లడ్డులో పంది కొవ్వు కలిసిందని విషప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ నివేదికతో డిఫెన్స్‌లో పడిందని, సభా సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రి పయ్యావుల కేశవ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.









