గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పునర్విభజన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడానికి గల కారణాలను వివరిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)గా విభజిస్తూ ఇటీవల జీవో నంబర్ 55 ను జారీ చేసింది. అయితే, ఈ విభజన 2027 జనగణనకు ముందు చేయకూడదనే కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ దరం గురువ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేషన్ కుమార్ సింగ్ ధర్మాసనం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మూడు వారాల్లోగా ఈ కౌంటర్లు దాఖలు చేయాలని, ఆ తర్వాత కేసును తదుపరి విచారణకు స్వీకరిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. విభజనపై స్టే విధించాలని పిటిషనర్ కోరారు.












