చిక్కబళ్లాపూర్ (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 09
ఒక మహిళను పరిచయం చేసుకుని, నమ్మించి సుమారు రూ.35 లక్షలు తీసుకుని, డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన బాధితురాలిని బెదిరించి వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన గిరీష్ రెడ్డి అలియాస్ గిరీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మహిళను వేధించి, రూ.35 లక్షలు స్వాహా. కర్ణాటక వాసి అరెస్ట్ ప్రొద్దుటూరు: మహిళను పరిచయం చేసుకుని నమ్మించి సుమారు రూ.35 లక్షలు తీసుకోవడంతో పాటు, డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన బాధితురాలిని బెదిరించి వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిట్టమడి వీధికి చెందిన ఒక మహిళ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న గిరీష్ రెడ్డి అలియాస్ గిరీష్, కర్ణాటక రాష్ట్రం జిల్లా గౌరిబిదనూరు తాలూకా హోసూరు గ్రామానికి చెందిన వ్యక్తి, ఆమెకు పరిచయమయ్యాడు. పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బాధితురాలి నమ్మకాన్ని సంపాదించిన గిరీష్ రెడ్డి, వివిధ సందర్భాల్లో ఆమె వద్ద నుంచి సుమారు రూ.35 లక్షలు తీసుకున్నాడు. అనంతరం బాధితురాలు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానంటూ ఆమెను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై బాధితురాలు జిల్లాలో ఫిర్యాదు చేయడంతో, తనపై ఫిర్యాదు చేశారనే విషయం తెలుసుకున్న నిందితుడు ప్రొద్దుటూరులోని బాధితురాలి నివాసానికి వచ్చి ఆమెను చంపుతానని బెదిరించినట్లు తెలిపారు. అంతేకాకుండా మరింత డబ్బులు ఇవ్వాలని, లేనిపక్షంలో తాను మరియు బాధితురాలు వివాహం చేసుకున్నట్లు తప్పుడు వివాహ ధ్రువీకరణ పత్రాల ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించి, ఆమె వద్ద నుంచి కొంత మొత్తాన్ని తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు గిరీష్ రెడ్డి అలియాస్ గిరీష్‌ను బెంగళూరులో అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని ప్రొద్దుటూరు JFCM మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. దీంతో నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు వన్ టౌన్ సి.ఐ. కొండారెడ్డి మాట్లాడుతూ, మహిళలను మోసం చేయడం, బెదిరించడం, వేధింపులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు ఇటువంటి వేధింపులు లేదా బెదిరింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.












