కామారెడ్డి, 2026-07-25
జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీలో నాణ్యత, ఖచ్చితత్వం, పారదర్శకత పాటించాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనగణన అధికారి ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన ఈ సూచనలు చేశారు.
జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ (District Census Handbook – DCHB) తయారీ ప్రక్రియలో ప్రతి దశను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, సమాచార సేకరణలో నాణ్యత, ఖచ్చితత్వం మరియు పారదర్శకతను పాటించాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనగణన అధికారి ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ జిల్లా సామాజిక, ఆర్థిక, భౌగోళిక, పరిపాలనా వివరాలకు ప్రామాణిక ఆధార గ్రంథంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అందువల్ల ప్రతి సమాచారాన్ని సంబంధిత రికార్డులతో సరిపోల్చి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని సూచించారు.
శిక్షణలో అందించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తిగా అవగాహన చేసుకుని, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, రెవెన్యూ, ప్రణాళిక (ప్లానింగ్) తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిర్ణీత గడువులోగా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. నాణ్యమైన సమాచారంతో జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ను సకాలంలో సిద్ధం చేయడం ప్రతి అధికార బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు.










