అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా () ప్రయోగించిన 22 ఏళ్ల నాటి స్విఫ్ట్ అంతరిక్ష టెలిస్కోప్ తన ప్రయాణాన్ని ముగించింది. విశ్వంలోని అత్యంత శక్తివంతమైన పేలుళ్లు, గామా కిరణాల విస్ఫోటనాలను పరిశీలించేందుకు 2004లో ప్రయోగించిన ఈ ఉపగ్రహం, ఇటీవల భూమి వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయింది. ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతం మీదుగా భూమి వాతావరణంలోకి ప్రవేశించినట్లు నాసా వెల్లడించింది.
సుమారు 3,200 పౌండ్ల (1,452 కిలోగ్రాముల) బరువున్న ఈ ఉపగ్రహం గంటకు అత్యంత వేగంతో ప్రయాణిస్తూ వాతావరణంలోకి ప్రవేశించింది. దీని వేగం ధ్వని వేగానికి సుమారు 22 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అమెరికా అంతరిక్ష దళం ప్రకారం, ఉదయం 7.39 గంటలకు (అమెరికా తూర్పు కాలమానం ప్రకారం, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.09 గంటలకు) భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. వాతావరణంలోని గాలి ఘర్షణ కారణంగా ఏర్పడిన అధిక ఉష్ణోగ్రతలకు ఉపగ్రహంలోని అధిక భాగం కాలిపోయింది. కొన్ని చిన్న భాగాలు మాత్రం భూమిని చేరి ఉండే అవకాశం ఉందని నాసా ముందుగా అంచనా వేసింది. అయితే ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. స్విఫ్ట్ ఉపగ్రహానికి అధికారికంగా నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ అని పేరు పెట్టారు. 2004లో నాసా దీన్ని అంతరిక్షంలోకి పంపించింది. తొలుత కేవలం రెండేళ్ల పాటు పనిచేసేలా రూపొందించినప్పటికీ, అంచనాలకు మించి రెండు దశాబ్దాలకుపైగా సేవలందించింది. విశ్వంలో సంభవించే గామా కిరణాల విస్ఫోటనాలను గుర్తించడం ఈ టెలిస్కోప్ ప్రధాన లక్ష్యం. గామా కిరణాల విస్ఫోటనాలు విశ్వంలో అత్యంత శక్తివంతమైన పేలుళ్లుగా పరిగణిస్తారు. ఇవి సుదూర నక్షత్ర మండలాల కేంద్ర ప్రాంతాల్లో సంభవిస్తాయి. ఈ పేలుళ్లు చాలా తక్కువ సమయంలోనే ముగిసిపోతాయి. అందువల్ల వాటిని వెంటనే గుర్తించి పరిశీలించడం శాస్త్రవేత్తలకు ఎంతో ముఖ్యం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్విఫ్ట్‌లో మూడు ప్రత్యేక టెలిస్కోపులు ఉన్నాయి. ఇవి గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు, అతినీలలోహిత కాంతి, దృశ్య కాంతి వంటి వివిధ తరంగదైర్ఘ్యాలను పరిశీలించగలవు. అంతరిక్షంలో ఎక్కడైనా గామా కిరణాల విస్ఫోటనం సంభవించినప్పుడు దాని స్థానాన్ని గుర్తించి, ఇతర పరిశీలనా కేంద్రాలకు సమాచారం పంపించేది. అనంతరం తన టెలిస్కోపులను ఆ ప్రాంతం వైపు మళ్లించి పరిశీలనలు జరిపేది. సాధారణంగా ఈ ప్రక్రియకు సుమారు ఒక నిమిషం పట్టేది. స్విఫ్ట్ తన సుదీర్ఘ ప్రయాణంలో అనేక కీలక శాస్త్రీయ పరిశోధనలకు సహకరించింది. విశ్వంలో 2,000కు పైగా గామా కిరణాల విస్ఫోటనాలను పరిశీలించింది. 1,400కు పైగా సూపర్నోవా పేలుళ్లను అధ్యయనం చేసింది. భారీ కాల రంధ్రాల ద్వారా నక్షత్రాలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియలను గుర్తించింది. నక్షత్రాల నుంచి వెలువడే ఎక్స్-కిరణాల ప్రకంపనలను పరిశీలించింది. సుదూర గెలాక్సీలలో జరిగే మార్పులను అధ్యయనం చేసింది. మన సౌర కుటుంబంలోని గ్రహశకలాలు, తోకచుక్కలను కూడా పరిశీలించింది. స్విఫ్ట్ సేకరించిన సమాచారంతో సుమారు 7,000 శాస్త్రీయ పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. దాదాపు 22 ఏళ్ల పరిశీలనలకు సంబంధించిన భారీ సమాచార నిధి నాసా వద్ద అందుబాటులో ఉంది. ఇందులో సుమారు 12 టెరాబైట్ల సమాచారం, 15 లక్షలకు పైగా అతినీలలోహిత, దృశ్య కాంతి చిత్రాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు భవిష్యత్తులోనూ ఉపయోగించుకోవచ్చు.












