ఎడపల్లి, 3 నవంబర్ 2026
రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యంతో పాటు పాడి, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి అనుబంధ రంగాలను సమీకృతం చేసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టడం ద్వారా నష్టాలను అధిగమించవచ్చని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం 113వ ఎపిసోడ్లో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన మాజీ సైనిక మేజర్, ప్రకృతి వ్యవసాయ రైతు సి.హెచ్. నవీన్ కుమార్ తన సమీకృత వ్యవసాయ విజయగాథను రైతులతో పంచుకున్నారు. భారత సైన్యంలో మేజర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి 15 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. వరి, కూరగాయల సాగుతో పాటు పాడి పశువులు, నాటు కోళ్ల పెంపకం, చేపల పెంపకం, మునగ, నేపియర్ గడ్డి, బంతిపూల సాగు చేపడుతున్నారు. వర్మీ కంపోస్టు, వర్మీవాష్, ప్రకృతి వ్యవసాయ కషాయాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో బయో రిసోర్స్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసి, ఇతర రైతులకు సేంద్రియ ఎరువులు, జీవ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామగ్రిని అందిస్తున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నవీన్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సైన్యంలో దేశానికి సేవలందించిన అనంతరం వ్యవసాయ రంగంలోనూ ఆదర్శంగా నిలుస్తున్న ఆయన ప్రయాణం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సమీకృత వ్యవసాయ విధానాలను ఇతర రైతులు కూడా అనుసరించాలని, తమ భూమి, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించుకొని, ప్రతి నీటి బొట్టును సమర్థంగా ఉపయోగించుకోవాలని అన్నారు.











